Sunday, December 16, 2012

కాలోయం బ్రహ్మ

ఏ వ్యక్తీ ఒకే నదిలో రెండుసార్లు స్నానం చెయలేడన్నది గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ ప్రసిద్ధ వాక్యాలలో ఒకటి. దీనికి, నీరు మారడం ఒక కారణమైతే, కాలం మారడం మరో కారణం. హెన్రీ బెర్గ్ సన్  తత్వ వాదాన్ని చెబుతూ నండూరి రామమోహన రావు గారు తమ విశ్వదర్శనం లో కాలం గురించి ఇలా వివరిస్తారు :
కాలం రెండు రకాలైనది. ఒకటి బాహిరమైన, భౌతిమైన కాలం. రెండవది అంతరమైన, మానసికమైన కాలం. మొదటి రకం కాలం గడియారంలో ముళ్ళ కదలికనుబట్టి తెలుస్తుంది. లేదా రాత్రింబవళ్ళ మార్పు, ఋతుచక్ర బ్రమనం వల్ల తెలుస్తుంది (blogger: ఋతురాగాలు చూస్తే తెలిసేది కాదేమో. క్షమించాలి ఆపుకోలేకపోయా). అది మనం కృత్రిమంగా గంటలు, నిముషాలు, సెకెండ్లు అని విభజించిన కాలం. అది వట్టి కల్పితకాలం. అది అసలు కాలం కాదు. మన అవసరార్థం ఈ విభజన చేసుకున్నాము

ఇప్పుడైతే సెకెండ్లు, నిముషాలు, గంటలతో సరిపెట్టుకుంటున్నాం గాని వేద కాలం లో ఈ విభజన చాలా సూక్ష్మంగా వుండేది. నరుని కొలమానం కాలానికి సరిపోవడం లేదంటారు వేదం జీవననాదం లో దాశరథి రంగాచార్య గారు. అందులోనే, పరమాణువు నుంచి ప్రళయం దాకా భారతీయులు కాలానికి కట్టిన లెక్కలు ఇలా వున్నాయి :
సూర్యుడు పరమాణువును ఆక్రమించిన కాలం పరమాణువు. సృష్టిలో అతి సూక్ష్మ పదార్థం పరమాణువు.
పరమాణువులు - 1 అణువు, 3 అణువులు - ఒక త్రసరేణువు , 3 త్రసరేణువులు - ఒక త్రుటి,
100 త్రుటులు - వేధ , 3 వేధలు - ఒక లవం , 3 లవములు - ఒక నిమేషం (ఇది మనం వాడుతున్న మినిట్ నిమిషం కాదు, ఇది సెకెనులో 16 /75 వ భాగం ), 3 నిమేషములు - ఒక క్షణం, 5 క్షణాలు - 1 కాష్ట,
10 కాష్టలు - ఒక లఘువు , 15 లఘువులు - ఒక గడియ , ఏడున్నర గడియలు - ఒక జాము ,
8 జాములు - ఒక రోజు, 15 రోజులు - ఒక పక్షం , 2 పక్షాలు - ఒక నెల , 2 నెలలు - ఒక ఋతువు
3 ఋతువులు - ఒక అయనం, 2 అయనాలు (ఉత్తర , దక్షిణ) - ఒక మానవ సంవత్సరం ,
17 ,28 ,000 సంవత్సరాలు - కృతయుగం , 12,96,000 సంవత్సరాలు - త్రేతాయుగం
8,64,000 సంవత్సరాలు - ద్వాపరం , 4,32,000 సంవత్సరాలు - కలియుగం
4 యుగాల మొత్తం కాలం 43,20,000 సంవత్సరాలు , సృష్టి కాలం 1000 x 4 యుగాలు

నిరంతరం మారుతూ వుండేది కాలం. అజేయమైన కాలం ప్రవాహం లాంటిది. అందుకే కాలోయం బ్రహ్మ అన్నారు. ఎన్ని సూక్ష్మ లెక్కలున్నా కాలప్రవాహాన్ని దర్శించలేము. ఈ క్షణాల పరంపరని ప్రత్యక్షంగా వీక్షించనూలేము, అనుభవించాల్సిందే. అందుకే రెండవదాన్ని మానసికమైన కాలం అని అనుకున్నాం. ఇది మన మనస్సుకే అనుభవైకవేద్యమైన కాలం.

భౌతిక కాలం అనేది క్షణాల దొంతర. అది వింటికి సందించిన బాణం వలె ఒకే దిశలో ముందుకే పోతుంది.  మానసిక కాలం అలా కాదు. అది జ్ఞాపకాల రూపంలో వెనక్కి, ఊహల రూపంలో ముందుకు ఎటు పడితే అటు కదులుతుంది. మనం మనస్సు అట్టడుగు పొరలలో వున్న జ్ఞాపకాలనైన సరే, మన నిత్య వ్యవహారానికి అవసరమైనప్పుడు, అవసరమైనవాటిని, పైకి తవ్వి తీసుకువచ్చి ఉపయోగించుకుంటాము అంటారు నండూరివారు (రామమోహన రావు).

ఆర్నాల్డ్ బెన్నెట్ తమ `How to live on 24 hours a day` అనే పుస్తకంలో  కాలం రోజువారి అద్బుతం ( Daily Miracle ) అని చాలా చక్కగా, చమత్కారంగా ఇలా వర్ణిస్తారు. పొద్దున్న లేవగానే కాలం మన పర్సులో 24 గంటలును ప్రసాదిస్తుంది. గొప్పవాళ్ళు, మేధావులని ఒక క్షణం ఎక్కుగాని, అధములు,  పనికిమాలినవాళ్లు అని ఒక క్షణం తక్కువగాని వుండదు. సర్వులూ సమానమే. అరువు తెచ్చుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం లాంటి  సౌలభ్యాలు అసలు వుండవు. చేతిలోని క్షణాన్నీ మాత్రమే కర్చు చేసుకోగలం. పని రాక్షసులైన , సోమరులైన తమ మరుసటి కోటా పదిలం. ఈ కోటాను ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనే దాన్ని బట్టే మన ఆయుః , ఆరోగ్య, ఐశ్వర్యాలతో పాటు మన సుఖ సంతోషాలు ఆధారపడి వుంటాయి.   దీన్ని బట్టి కాలానికి మించిన సమవర్తి లేదని మనం అర్థంచేసుకోవచ్చు. ప్రతీ క్షణాన్ని మైమరచి అస్వాదించడంలోనే అందము ఆనందమూ దాగివున్నాయి. కాలమే సత్యము, శివము, సుందరము.